హైదరాబాద్ నడిబొడ్డున గిరిజన బాలిక అమానుషంగా అత్యాచారానికి, హత్యకు గురైతే, బాధిత కుటుంబాన్ని పరామర్శించేంత మానవత్వం కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేకుండాపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తన బంధువు తండ్రి మరణిస్తే ఆగమేఘాలపై ఢిల్లీ నుంచి వచ్చి పరామర్శించిన కేసీఆర్ బాలిక కుటుంబాన్ని ఎందుకు ఓదార్చలేదని ప్రశ్నించారు.దొరలకో న్యాయం, దళిత, గిరిజనులకు మరో న్యాయమా అని నిలదీశారు. ఇక్కడి సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని రేవంత్ సోమవారం పరామర్శించారు. దేవరకొండ, ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి రేవంత్ చేతుల మీదుగా రూ.1.5 లక్షలను అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హోంమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో ఘటన జరిగితే ఆయనగానీ, సింగరేణి కాలనీని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్న మంత్రి కేటీఆర్‌గానీ, నగర మంత్రులుగానీ ఎందుకు స్పందించటం లేదన్నారు.నిందితుడ్ని పట్టుకోవడం పోలీసులకు చేతకావట్లేదన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు మంత్రి కేటీఆర్, మద్యానికి సీఎం కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఇదిలాఉండగా, గాంధీభవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలానికి చెందిన సామాజిక కార్యకర్త గుజ్జుల మహేష్.. రేవంత్‌రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలసి కాంగ్రెస్‌లో చేరారు.