కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ… రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. అప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు జూడా సంఘం రాష్ట్ర, గాంధీ యూనిట్ అధ్యక్షులు వాసరి నవీన్‌రెడ్డి, మణికిరణ్‌రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
స్టైపెండ్‌ను జనవరి 2020 నుంచి పెంచాలని, విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, జూడాలకు బీమా సౌకర్యంతోపాటు కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, సీనియర్ డాక్టర్ల సమస్యల్ని కూడా పరిష్కరించకుంటే తాము కూడా సమ్మె బాట పడతామని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీఎస్‌ఆర్‌డీఏ) స్పష్టం చేసింది. ఈ సంఘం ప్రతినిధులు తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) డైరెక్టర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు.