ఏసీబీ ప్రత్యేక కోర్టులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి తమకుందని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సాంబశివరావు నాయుడు శుక్రవారం కొట్టివేశారు. నిందితులపై అభియోగాల నమోదు కోసం తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేశారు. ‘నిందితులపై నమోదు చేసిన అభియోగాలను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉంది.అవినీతి నిరోధక చట్టం కింద ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన అభియోగాలను విచారించే పరిధి ప్రత్యేక కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు పీవీ నరసింహారావు కేసులో స్పష్టమైన తీర్పును ఇచ్చింది. తమ పేర్లను ఈ కేసు నుంచి తొలగించాలంటూ ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, హ్యారీ సెబాస్టియన్‌లు దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటిషన్లను ఇదే న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కోర్టు తీర్పును హైకోర్టు కూడా సమర్థ్ధించింది.ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్‌ను 2017లో కోర్టు విచారణకు స్వీకరించి నిందితులకు సమన్లు జారీచేసింది. దాదాపు నాలుగేళ్లు మౌనంగా ఉండి.. ఇప్పుడు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. ప్రత్యేక కోర్టులో తుది విచారణ జాప్యం చేసేందుకే నిందితులు ఒకరి తర్వాత మరొకరు ఈ తరహా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు’అని ఏసీబీ స్పెషల్ పీపీ సురేందర్‌రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది.