చైనా భారత్ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలోనూ భారత్ మానవత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ.. వాటిని చైనా సైన్యానికి మన దేశ జవాన్లు అప్పగించారు. ఈ విషయాన్ని ఈస్ట్రన్ కమాండ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. చైనా అధికారులు వీటి స్వీకరించి కృతజ్ఞతలు తెలిపారని ట్వీట్‌లో పేర్కొంది. “ఆగస్టు 31న ఈస్ట్ కమేంగ్ ప్రాంతంలో ఇవి తిరుగుతూ కనిపించాయి. వీటిపై మానవత్వం చూపిస్తూ, ఈ నెల 7వ తేదీన చైనా అధికారులకు అప్పగించాం” అని పేర్కొంది.ఈ చర్యలు ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు తగ్గించడానికి ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా ఓ వైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే, మరోవైపు కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎమ్ నారావణే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాంగ్యాంగ్ సరస్సు వద్ద ఉన్న కీలక ప్రాంతాలపై పట్టు కోసం ఇరు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య కాల్పులు కూడా జరిగాయి. పరిస్థితిని పునరుద్దరించడానికి ఇరుదేశాల నేతలు అనేక సార్లు చర్యలు జరుపుతున్నప్పటికీ ఈ సమస్య ఒక కొలిక్కి రావడం లేదు. ఫింగర్ గల్వాన్ వ్యాలీ, హాట్ స్ప్రింగ్స్, కొంగ్రుంగ్ నాలా తదితర ప్రాంతాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. గత జూన్ లో చైనా దళాలతో పోరులో 20 మందికి పైగా భారత జవాన్లు అమరులైన తరువాత ఈ ప్రాంతంలో పరిస్థితులు క్షీణించాయి.