ఇటీవల తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజగుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కేసును సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్ రెడీ చేశారు. 143మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది.మరో వైపు యువతిపై అత్యాచారం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. సుమారు 27 మంది ఏబీవీపీ జెండాలతో కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. మహిళపై లైంగికదాడి చేసిన వారిని శిక్షించాల్సిన బాద్యత పోలీసులపై ఉందని, విచారణ మాత్రం నామమాత్రంగా జరుగుతుందంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.