మహిళల ఆస్తి హక్కుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 2005 అమలుకు ముందే తండ్రి మరణించినప్పటికీ, వారికి తల్లిదండ్రుల ఆస్తిపై హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కీలక తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టంలో 2005 సవరణ ప్రకారం కుమార్తెలకు తండ్రి ఆస్తిలో సంపూర్ణ హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. సవరణ సమయం 2005 సెప్టెంబర్ 9 నాటికి తండ్రి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఆమెకు వారసత్వ హక్కు ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది.
2005లో చట్టం అమల్లోకి వచ్చేనాటికి తండ్రి చనిపోతే సోదరులు ఆస్తిలో వాటా నిరాకరించడంపై దాఖలైన పిటిషన్లను విచారించిన అత్యున్నత న్యాయస్థానం 2005 నాటికి తండ్రి మరణించినా, బతికి ఉన్నా ఆడపిల్లలకు సమాన వాటా దక్కాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ అంశంపై ట్రయల్ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న విషయాలను ఆరు నెలల్లో నిర్ణయించాలని ధర్మాసనం ఆదేశించింది.