దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా రోజుకు 34 వేల మందికి పైగా రోగులు కోలుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రికవరీ రేటు ఎంతో ఆశాజనకంగా ఉందని, ఏప్రిల్‌లో 7.85 శాతం ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 64.4 శాతానికి చేరుకుందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. దేశంలోని 16 రాష్ట్రాలలో రికవరీ రేటు జాతీయ సగటు కన్నా అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఢిల్లీలో రికవరీ రేటు 88 శాతం ఉండగా లడఖ్‌లో 80 శాతం, హర్యానాలో 78 శాతం, అస్సాంలో 76 శాతం, తెలంగాణలో 74 శాతం, తమిళనాడు, గుజరాత్‌లో 73 శాతం చొప్పున, రాజస్థాన్‌లో 70 శాతం, మధ్యప్రదేశ్‌లో 69 శాతం, గోవాలో 68 శాతం ఉందని భూషణ్ వివరించారు. జూన్ 4వ తేదీనాటికి ఒక లక్ష మంది కోలుకోగా జూన్ 25వ తేదీకి ఈ సంఖ్య 3.47,978కి చేరుకుందని, జులై 29 నాటికి ఇది 10 లక్షలు దాటిందని ఆయన చెప్పారు. నేటికి ఆ సంఖ్య 10.20 లక్షలు ఉందని, కేంద్ర, రాష్ట్రాల కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో రికవరీ రేటు సాధించడంలో వైద్య సిబ్బంది, కృషి ఎనలేనిదని ఆయన ప్రశంసించారు. దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందని ఆయన చెప్పారు. జూన్‌లో మృతుల రేటు 3.33 శాతం ఉండగా ఇప్పుడది 2.21 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. కొవిడ్-19 మరణాల రేటు రష్యాలో 1.6 శాతం ఉందని, అయితే ఇతర వర్ధమాన దేశాలు, పొరుగుదేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు చాలా తక్కువగా ఉందని భూషణ్ తెలిపారు. దేశంలోని 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కన్నా తక్కువగా మరణాల రేటు ఉందని ఆయన తెలిపారు.