పంజాబ్‌లో నకిలీ పెన్షనర్ల స్కామ్ బయటపడింది. అర్హత లేని సుమారు 70 వేల మంది అక్రమపద్ధతిలో సీనియర్ పెన్షన్ పొందుతున్నట్లు తేలింది. ఈ కుంభకోణం దాదాపు 162 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే అక్రమ పద్ధతిలో పెన్షన్ తీసుకున్న వారి నుంచి డబ్బు వసూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష అకాలీదళ్ మధ్య మాటలయుద్ధం మొదలైంది. పెన్షన్ అక్రమం బయటపడడంతో.. 70వేల మందిని పెన్షర్ జాబితా నుంచి తొలగించారు. మోగా జిల్లాకు చెందిన 65 ఏళ్ల గుర్‌తేజ్ కౌర్ తనకు పెన్షన్ రావడంలేదనడంతో ఈ స్కామ్ బహిర్గతమైంది. కుంభకోణం విలువ సుమారు 162 కోట్లు ఉంటుందని ఆ రాష్ట్ర సోషల్ సెక్యూర్టీ డిపార్ట్‌మెంట్ పేర్కొన్నది.
అర్హలు కాని వారికి కూడా పెన్షన్ ఇచ్చారని ఆ రాష్ట్ర మంత్రి అరుణా చౌదరి తెలిపారు. 2015లో ఈ స్కామ్ మొదలైనట్లు తెలుస్తోంది. అర్హత లేని వారు కూడా ఓల్డేజ్ పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారని తేల్చారు. పెన్షన్‌దారుల నుంచి డబ్బులు వసూల్ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో.. ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శలు మొదలుపెట్టింది. ప్రభుత్వం మానవ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది. కుంభకోణానికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.