ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసీ ఉమెన్ బయోటాయిలెట్ బస్సులకు వేసిన రంగుల విషయంపై సిఎం కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో టాయిలెట్ వెళ్లేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బయో టాయిలెట్స్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం ఆర్టీసీలో పాత బస్సులను వినియోగిస్తున్నారు. అయితే ఈ బస్సుల్లో మహిళలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా టాయిలెట్స్‌ను రూపొందించారు.బయటికి వచ్చిన సమయంలో వీటిని మహిళలను ఏలాంటి జంకు లేకుండా వినియోగించుకునేలా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో వీటిని తీర్చిదిద్దింది. ఈ బయోటాయిలెట్స్‌ను కేవలం మహిళల కోసం మాత్రమే రూపొందించారు. అయితే ఇంతమంచి సదుద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులకు గులాబీ రంగును వేశారు. దీన్ని గుర్తించిన సిఎం కెసిఆర్ ఉమెన్ బయో టాయిలెట్స్ బస్సులకు వేసిన గులాబీ రంగును తొలగించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కు సూచించారు. ఈ విషయమై రవాణ శాఖ మంత్రి అజయ్‌కు సిఎం కెసిఆర్ ఫోన్ చేశారు. మహిళలకు ఇబ్బందులు కలగొద్దనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆర్టీసీ ఉమెన్ బయో టాయిలెట్ బస్సులకు ఎట్టిపరిస్థితుల్లోనూ గులాబీ రంగు లేకుండా ఉండకుండా చూడాలన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలను వెంటనే అమలు చేయాలంటూ మంత్రి పువ్వాడ ఆర్టీసీ అధికారులకు సూచించారు. దీంతో ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగి బస్సులకు ఉన్న గులాబీ రంగులను మార్చే పని మొదలుపెట్టారు.