కరోనా టెస్టు చేయకుండానే పాజిటివ్ గా నిర్ధారించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగింది. నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పట్టణంలోని గ్రీన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో పట్టణ ప్రజలతో పాటు.. చుట్టు పక్కల మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు స్వచ్చందంగా కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకువచ్చారు. అందరిలాగే.. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని చిలకమర్రి గ్రామానికి చెందిన ఓ మహిళ కూడా కరోనా పరీక్షల కోసం అక్కడికి చేరుకుంది. అప్పటికే క్యూలైన్ చాలా పెద్దగా ఉన్నా.. పరీక్షలు చేయించుకోవాలన్న ఉద్దేశంతో ఆ మహిళ లైన్ లో నిలబడింది. ఆమె వంతు వచ్చేసరికి కరోనా కిట్స్ అయిపోయాయి. దాంతో వైద్య సిబ్బంది.. మిగిలిన వారందరినీ మరుసటి రోజు రావాలని కోరారు. దాంతో ఆ మహిళ ఇంటికి వెళ్లిపోయింది. అయితే సాయంత్రానికి వైద్య సిబ్బంది ఆ మహిళకు కరోనా సోకినట్లు తెలిపారు. అసలు పరీక్షలే చేయకుండా తనకు కరోనా అని ఎలా తేల్చారని సదరు మహిళ బిత్తరపోయింది. సోమవారం ఫంక్షన్ హాల్లో సుమారు 200 మందికి కరోనా పరీక్షలు చేశారు. వారిలో 48 మందికి పాజిటివ్ అని తేల్చారు. ఆ 48 మందిలో తన పేరు ఉండటంతో ఆ మహిళ అవాక్కయింది. పరీక్షలే చేయని మహిళకు కరోనా సోకినట్లు లిస్టులో చేర్చడాన్ని చూస్తే సిబ్బంది కరోనా పట్ల ఎంత జాగ్రత్తగా ఉన్నారో అర్థమవుతోంది. ఇప్పటివరకు షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 240 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8 మంది మృతి చెందారు.