ఖరీఫ్-2020 కాలానికి ప‌్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) కింద రైతులు తమ పంటలకు బీమా చేసుకోవాల్సిందిగా కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. బీమాతో విత్తనాల దశ నుండి పంటకోత సమయం వరకు పంట నష్టాన్ని కవర్ చేస్తుందన్నారు. పలు రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంటల బీమా కార్యక్రమం జోరుగా కొనసాగుతుందని తెలిపారు. ఆహార పంటలకు(తృణధాన్యాలు, నూనెగింజలు) లకు 2 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం రేటుతో బీమా పొందవచ్చన్నారు. మిగతా ప్రీమియంను కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు.పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఖరీఫ్ 2020 సీజన్ కట్ ఆఫ్ తేదీ 31జూలై, 2020 నాటికి ముగుస్తుందన్నారు. కావునా ప్రకృతి వైపరిత్యాల నుండి రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా చేసుకోవాల్సిందిగా సూచించారు. కరువు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, వర్షపాతం, వడగళ్ళు, సహజ మంటలు, తుఫాను, వడగళ్ళు, అకాల వర్షపాతం నుండి బీమా కవరేజ్ ఉంటుందని తెలిపారు.పంటల బీమా పథకం అమలులో మునుపటి కొన్ని సవాళ్లను పరిష్కరిస్తూ 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం పిఎమ్‌ఎఫ్‌బివై కు కొన్ని సవరణలు చేసింది. ఖరీఫ్ -2020 నుండి రైతులందరికీ ప్రభుత్వం ఈ పథకాన్ని స్వచ్ఛందంగా చేసింది. ఇంతకుముందు రుణగ్రహీతలందరికీ ఈ పథకం తప్పనిసరి. ఇప్పుడు రుణ బకాయిలు ఉన్న రైతులు కట్ఆ ఫ్ తేదీకి ఏడు రోజుల ముందు తమ బ్యాంక్ బ్రాంచ్‌కు ఒక సాధారణ డిక్లరేషన్‌ను సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని నిలిపివేయవచ్చు.పిఎమ్‌ఎఫ్‌బివై కింద నమోదు చేసుకోవాలనుకునే ఏ రైతు అయినా తన సమీప బ్యాంక్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్ (సిఎస్‌సి), విలేజ్ లెవెల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (విఎల్‌ఇ), వ్యవసాయ శాఖ కార్యాలయం, బీమా కంపెనీ ప్రతినిధి లేదా నేరుగా ఆన్‌లైన్ Www.pmfby.gov.in లో సంప్రదించొచ్చు.