రాష్ట్ర గవర్నర్ సౌందరరాజన్ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్ స్వయంగా వెల్లడించారు. ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. రెడ్జోన్లో ఉన్నవారు, కరోనా రోగులను కలిసిన వారు దయచేసి వీలైనంత తొందరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం వల్ల మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా. ఎదుటివారిని కాపాడిన వాళ్లమవుతామని, ఏమాత్రం సంకోంచించకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మీరు పరీక్షలు చేయించుకొని.. ఎదుటివారిని ప్రోత్సహించండి. ముఖ్యంగా ‘4టీ’లను పాటించండి. టెస్ట్ (పరీక్ష), ట్రేస్ (కరోనా వచ్చిన వారిని గుర్తించడం), ట్రీట్ (చికిత్స), టీచ్ (ఎదుటివారికి చెప్పడం)మని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పలు ఆస్పత్రుల్లో కరోనా రోగులను, వైద్యులను కలిశారు.