నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై ఐసీడీఎస్ అధికారికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గురువారం షాద్‌నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే… ఫరూఖ్‌నగర్ గుండుకేరికి చెందిన అమ్మాయి(18) పదో తరగతి పూర్తి చేసింది.రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో ఈమెకు పెళ్లి సంబంధం చూశారు. ఈ నెల 31న వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి ఇష్టం లేదని సదరు అమ్మాయి షీ టీం పోలీసులకు ఫోన్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో అమ్మాయి.. ఐసీడీఎస్ అధికారి నాగమణికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఎక్కడైనా ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించి చదువకునే అవకాశం కల్పించాలని కోరింది. దీంతో నాగమణి అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం షీ టీం పోలీసులు విషయాన్ని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌కు వివరించి యువతిని హైదరాబాద్ వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు.