కరోనా కేసులో భారత్ ౩వ స్థానం దీనికి కేంద్రం వైఫల్యం అని ఆరోపణలు చేయలేము -మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 3శాతం ఉంటే.. రాష్ట్రంలో రెండుశాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. కరోనా కేసుల్లో భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో కొనసాగుతున్నదని.. దీనికి కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఆరోపణలు చేయలేమని అన్నారు. కరోనా సమస్యను సానుకూల దృక్పథంతో చూస్తున్నామని తెలిపారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమర్శలు చేసుకోవడం కాకుండా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు.ప్రపంచంలో సంపన్న దేశాలే వైద్యసేవలు అందించలేని స్థితిలో ఉంటే.. కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని ప్రతిపక్షాలు నోరుపారేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇంకా ఎక్కువకాలం లాక్‌డౌన్‌ విధిస్తే ప్రజలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉన్నదని.. ప్రతి ఒక్కరికీ జీవితంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యమేనన్నారు. కరోనాతో సహజీవనం చేస్తూనే ఆర్థికాభివృద్ధి సాధించాల్సి ఉన్నదని చెప్పా రు. బుధవారం కరీంనగర్‌ జిల్లా నగునూర్‌లోని ప్రతిమ మెడికల్‌ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంచార వైద్యశాలతోపాటు టెలిమెడిసిన్‌ సేవలను మంత్రులు ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అంతకుముందు చొప్పదండి మండలం వెదురుగట్టలోని ఫారెస్ట్‌బ్లాక్‌ను సందర్శించి మొక్కలు నాటారు. ప్రతిమలో కేటీఆర్‌ మా ట్లాడుతూ.. వైరస్‌ బారినపడినవారికి వైద్యులు, సి బ్బంది ప్రాణాలకు తెగించి.. వారికి వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. కొవిడ్‌ వివరాలు దాస్తున్నామని కొందరు పిచ్చి కూతలు కూస్తున్నారని.. లెక్కలుదాస్తే మరణాల సంఖ్యను ఏవిధంగా దాస్తామో ఇలాంటివాళ్లు ఆలోచించుకోవాలన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా చెట్ల ప్రాధాన్యాన్ని గుర్తించిన ఏకైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మొక్కలను సంరక్షించకపోతే భవిష్యత్తులో గాలికూడా కొనుక్కునే పరిస్థితి వస్తుందనే ఆలోచనతోనే హరితహారానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. వెదురుగట్టలోని 170 ఎకరాల్లో 65 వేల మొక్కలునాటి, వాటిని సంరక్షించడం అభినందనీయమని, ఇదేస్ఫూర్తితో రాష్ట్రంలోని అన్నిచోట్ల మొక్కల పెంపకాన్ని మహాయజ్ఞంలా కొనసాగించాలని సూచించారు. రాష్ట్రంలో 12,750 గ్రామాల్లో మొక్కల సంరక్షణకు ట్రాక్టర్లు, ట్యాంకర్లు, ఇతర వసతులు సమకూర్చామని చెప్పారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews