కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ తమిళ సై ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలను కోరారు. అంతేకాదు.. నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని గవర్నర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో గవర్నర్ తమిళ సై వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో 11 ప్రయివేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు పాల్గొన్నాయి. కరోనా కల్లోలంతో భయాందోళనలు పెరిగిపోతున్న దృష్ట్యా అనేక కారణాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల పట్ల బాధ్యతగా మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందటంలేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. కార్పొరేట్ హాస్పిటల్స్ కు వచ్చే పాజిటివ్ రోగులకు భరోసా కల్పించాలన్నారు. పాజిటివ్ బాధితులు హాస్పిటల్స్ రాగానే కచ్చితంగా చేర్చుకోవాలని, నాలుగైదు హాస్పిటల్స్ తిరిగే పరిస్థితి రాకూడదని గవర్నర్ హెచ్చరించారు. అలాగే టెస్టులు బాధ్యతతో చేయాలని అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్స్ కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల సహకారం తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషేంట్స్ నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.