విషపూరిత రసాయనాలు ఉన్న తొమ్మిది శానిటైజర్లను ఉపయోగించొద్దని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎస్క్‌బయోకెమ్ సంస్థను ఆదేశించింది. ఈ సంస్థ తయారు చేసిన శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉందని ఎఫ్‌డీఏ గుర్తించింది.మిథనాల్ ఉన్న శానిటైజర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. దానిని చేతులకు రాసుకున్నప్పుడు అది చర్మం దీనిని శోషించుకుంటుంది. ఫలితంగా వికారం, జలుబు, వాంతులు, తలనొప్పి, చూపు కోల్పోవడం, కోమా, వణుకు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు నరాల వ్యవస్థ దెబ్బతిని మరణానికీ దారితీసే ప్రమాదం ఉంది.మార్కెట్లలోని ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్, ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజర్, లావర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజర్, ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియల్ జెల్ హ్యాండ్ శానిటైజర్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 70% ఆల్క్‌హాల్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80% ఆల్కహాల్, శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్లను ఉపయోగించొద్దని వినియోగదారులకు ఎఫ్‌డీఏ సూచించింది.కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా శానిటైజర్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. చేతులకు అంటిన వైరస్‌ను నిర్మూలించాలంటే సబ్బు నీటితో కడుక్కోవడం లేదా ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో రాసుకోవడం తప్పనిసరి.