యాభై లక్షల లంచమిస్తూ పట్టుబడిన రేవంత్‌రెడ్డి.. వందశాతం నిజాయితీపరుడైన మంత్రి కే తారకరామారావుపై అవినీతి ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. అవినీతికిపాల్పడి జైలుకెళ్లొచ్చిన ఓ వ్యక్తి.. కేటీఆర్‌ను అవినీతిపరుడు అనడం బాధాకరమని తెలిపారు. ఒక ఫాం హౌజ్ నిర్మాణంపై దర్యాప్తునకు ఆదేశిస్తే, కేటీఆర్‌ను మంత్రి పదవికి రాజీనామా చేయాలనడం ఎక్కడి లాజిక్కో అర్థం కావడంలేదని రేవంత్‌పై మండిపడ్డారు.
ఆదివారం హైదరాబాద్‌లో తన నివాసంలో పోసాని మీడియాతో మాట్లాడారు. ఒకరిని విమర్శించడానికో.. మరొకరిని పొగడటానికో తాను ప్రెస్‌మీట్ పెట్టలేదని చెప్పిన పో సాని.. ఎన్టీఆర్‌లాంటి నిజాయితీపరుడు, ప్రజాసేవకుడు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కేటీఆర్ ఒక్కరే అని తెలిపారు. కేటీఆర్ హానెస్ట్‌పర్సన్ అని అభివర్ణించారు. రెండుమూడ్రోజులు గా ఆయనపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలు చూసి తాను మీడియా ముందుకురావాల్సి వచ్చిందని వివరించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు 100 శాతం నిజాయితీపరులని, భవిష్యత్‌లో వీరిద్దరూ తెలంగాణకు రెండుకండ్లు అని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారిని అవినీతిపరులు అన డం ప్రతిపక్షాలకు రివాజుగా మారిందని విమర్శించారు. కేటీఆర్.. కేసీఆర్ నోట్లోనుంచి ఊడిపడ్డట్టే ఉంటారని, తండ్రిలాగే మంచివక్త అని పేర్కొన్నారు. ప్రజల మధ్య, పోలీసుల మధ్య, రాజకీయవ్యవస్థలో ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి అని చెప్పారు. ‘కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత అంతా మంచి నాయకులు. ఒకవేళ వాళ్లు అవినీతి చేసినట్టు మీవద్ద ఏదైనా ఆధారం ఉంటే వచ్చి నా చెంప మీద కొట్టండి. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను నమ్మొద్దని తెలంగాణ ప్రజలను కోరుతున్నా’ అని పోసాని చెప్పారు. కేటీఆర్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే తన మాటలను వెనక్కి తీసుకొని.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మొ త్తం తిరుగుతా అని సవాల్ విసిరారు.