జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్పందించి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని బాలయ్య కూడా పట్టుబట్టి స్థానిక నేతలకు నిత్యం టచ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో కావలి వైసీపీ ఎమ్మెల్యే.. బాలయ్యకు ఫోన్ చేశారు.గురువారం మధ్యాహ్నం స్వయంగా ఫోన్ చేసిన ఎమ్మెల్యే.. విగ్రహం వివాదంపై బాలయ్యతో నిశితంగా చర్చించారు. అసలు విగ్రహంపై వివాదం ఎందుకు రాజుకుంది..? స్థానికులు ఆ విగ్రహాన్ని ఎందుకు తొలగించాల్సి వచ్చింది..? అనే విషయాలను బాలయ్యకు వివరించారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని బాలయ్యకు ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని కూడా బాలయ్యకు స్థానిక ఎమ్మెల్యే ఇచ్చారు. ఈ సందర్భంగా.. తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానిని అని ఆయనకు రామిరెడ్డి చెప్పారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. గత కొన్ని రోజులుగా ఈ విగ్రహం తొలగింపుపై నెలకొన్న వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.