పెద్దపల్లి జిల్లా వైద్యారోగ్యశాఖ సర్వైవ్‌లెన్స్ అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. ట్విట్టర్ ద్వారా ఉపరాష్ట్రపతి స్పందిస్తూ, కరోనా మృతుడి భౌతికకాయం తరలింపునకు మున్సిపాలిటీ డైవర్ నిరాకరించడంతో స్వయంగా తానే
ట్రాక్టర్ నడిపి శ్మశానవాటికకు తీసుకెళ్లిన పెద్దపల్లి జిల్లా కరోనా నిఘా అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరాం చొరవను అభినందిస్తున్నాను. వీరి చొరవ, అంకితభావం సమాజానికి స్ఫూర్తిదాయకం కావాలని పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడకు చెందిన 45 ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆదివారం పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానలో చేరాడు. ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆ రోజే ఉదయం 9.30 గంటల ప్రాంతంలో మృతిచెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా రావడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో మున్సిపల్ అధికారులు శవాన్ని తరలించేందుకు ట్రాక్టర్‌ను ఏర్పాటు చేశారు. అయితే చనిపోయిన వ్యక్తి కరోనా పాజిటివ్ అని తేలడంతో వాహనం నడిపేందుకు ఆ ట్రాక్టర్ డైవర్ సైతం నిరాకరించాడు. దీంతో వైద్యారోగ్యశాఖ జిల్లా సర్వైవ్‌లెన్స్ అధికారి డాక్టర్ పెండ్యాల శ్రీరామ్ మానవతా థృక్పదంతో ముందుకు వచ్చారు. ఇతర వైద్యుల సహకారంతో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో వేసుకుని తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. కొవిడ్ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. డాక్టర్ చూపిన మావనవతపై సర్వత్రా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.