తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు ఈరోజు ఉదయం నుండే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కొత్త సచివాలయం నమూనా ఖరారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సిఎం కార్యాలయం విడుదల చేసింది. కాగా హైకోర్టు తీర్పుతో తెలంగాణ సచివాలయ కొత్త భవన నిర్మాణానికి మార్గం సుగమమైన నేపథ్యంలో పాత భవనం కూల్చివేత పనుల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయం కూల్చివేస్తున్న నేపథ్యంలో పాత సచివాలయం వైపు వెళ్లే అన్ని రహదారులు మూసివేశారు. అటు వైపు ఎవరినీ రానివ్వకుండా పోలీసులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు సచివాలయం బీఆర్కే భవన్‌ను క్లోజ్ చేశారు. ఎవరూ రావొద్దని సచివాలయ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు చేశారు.