వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు

రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు. దీనికోసం వ్యవసాయశాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.
రాష్ట్రంలో, దేశంలో ప్రజల ఆహార అలవాట్లపై అధికారులు కచ్చితమైన అంచనాలు రూపొందించాలి. ఏ ప్రాంతంలో ఏ ఆహార పదార్థాల అవసరం ఉన్నదో గమనించాలి. ప్రపంచంలో ఏ పంటకు డిమాండ్‌ ఉన్నదో తెలుసుకోవాలి. ఆ మేరకు రాష్ట్రంలో పంటలు సాగవ్వాలి. ఇది నిరంతరం కొనసాగాలి. ఇందుకు ప్రభు త్వం.. నిపుణులతో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీని నియమిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల డిమాండ్‌ మార్కెటింగ్‌ ధరలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఏ పంటలు వేయడం వల్ల లాభమో సూచిస్తుంది. దాని ప్రకారం పంటల సాగు చేపట్టాలి.
వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగడం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక సాగుపద్ధతులను అవలంబించాలి. ఎరువు లు, పురుగుమందుల వాడకంలోనూ శాస్త్రీయత ఉండాలి. మేలురకం విత్తనాలు వేయా లి. సాగులో యాంత్రీకరణ పెరుగాలి. అందు కు అనుగుణంగా సాగుజరుగాలి. ఈ విషయాలపై ఎప్పటికప్పుడు అధ్యయనంచేస్తూ, తగు సూచనలు ఇవ్వడానికి ప్రభు త్వం అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ కమిటీని నియమిస్తుంది.
తెలంగాణలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలున్నాయి. ఏ నేలలు ఏ పంట సాగుకు అనువైనవో తేల్చాలి. దానికి అనుగుణంగా పంట ల సాగు చేపట్టాలి. పంటల కాలనీల ఏర్పాటుకోసం నేలల విభజన చేయాలి. ఈ వివరాలను రైతులకు తెలుపాలి.
రాష్ట్రంలో ప్రజలు నిత్యం తినే పండ్లు, కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. ఏయే రకాల పండ్లు, కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నామో లెక్కలు తీయాలి. వాటిని మన రాష్ట్రంలోనే పండించాలి. పండ్లు, కూరగాయల విషయంలో స్వయంసమృద్ధి సాధిం చే ప్రణాళిక రూపొందించి అమలుచేయాలి.
రాష్ట్రంలో కొత్తగా అనేక ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. మిషన్‌ కాకతీయతో చెరువుల నీటి సామర్థ్యం పెరిగింది. భూగర్భ జలాలు పెరిగాయి. 24 గంటల ఉచిత విద్యుత్‌ వల్ల బోర్ల ద్వారా సాగు పెరిగింది. దీంతో ప్రతి ఏటా కొత్తగా ఆయకట్టు పెరుగుతూ వస్తున్నది. పెరిగిన/పెరిగే విస్తీర్ణాన్ని సరిగ్గా అంచనా వేస్తూ, పంటల సాగు ప్రణాళికలు తయారుచేయాలి.
ఉద్యానశాఖను మారిన పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దాలి.
సరైన పంటల లెక్కల నమోదుకు ప్రత్యేకంగా స్టాటిస్టికల్‌ విభాగం ఏర్పాటు చేయాలి.
తెలంగాణలో పత్తి పంట ఎక్కువ పండిస్తున్నారు. పత్తిలో ఉత్పాదకత పెంచడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? ఏ రకమైన పత్తికి మార్కెట్‌ ఉన్నది? అలాంటి పత్తి సాగుచేయాలంటే ఏంచేయాలి? తదితర విషయాలను అధ్యయనంచేసి, తగు సూచనలు ఇవ్వడానికి, పత్తి రైతులకు చేదోడు వాదోడుగా ఉండడానికి ప్రభుత్వం కాటన్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నది.
తెలంగాణలో పండే పత్తికి మంచి డిమాండ్‌ ఉన్నది. నూలు పొడవు ఎక్కువ ఉండటం వల్ల మంచి ధర వస్తుంది. పత్తిలో మట్టి, పుల్లలు, ఇతర చెత్త కలువడం వల్ల సరుకులో నాణ్యత (ఫెయిర్‌ యావరేజ్‌ క్వాలిటీ – ఎఫ్‌ఏక్యూ) శాతం పడిపోయి ధర తగ్గుతున్నది. కష్టపడి పంట పండించే రైతులు పత్తి ఏరిన తర్వాత అందులో చెత్త కలువకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో వారికి అవగాహన కల్పించాలి.
రాష్ట్రంలో జిన్నింగ్‌ మిల్లులు, స్పి న్నింగ్‌ మిల్లుల సామర్థ్యంపై కచ్చితమైన అంచనాలు వేయాలి. అవి సరిపోను ఉన్నాయా? ఇంకా నెలకొల్పాలా? అన్నదానిపై శాస్త్రీయమైన అంచనా ఉండాలి. పత్తి పం డే ప్రాంతాల్లోనే ఇవి నెలకొల్పడం వల్ల రవాణా, ఇతర వ్యయప్రయాసలు కూడా తప్పుతాయి.
పట్టణ ప్రాంతాల్లో పండ్లు, కూరగాయల అవసరం ఎక్కువగా ఉం టుంది. అందుకే పట్టణ ప్రాంతాల పరిసరాల్లోని భూముల్లో పండ్లు, కూరగాయల సాగుకు అనువైన నేలలను గుర్తించి, రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అటు రైతులకు, ఇటు వినియోగదారులకు మేలు జరుగుతుంది.
ఉల్లిగడ్డల లభ్యత, ధరల విషయంలో ప్రతి ఏడాది అనిశ్చితి, అస్పష్టత నెలకొంటున్నది. ఇలా ఎందుకుండాలి? ప్రజల అవసరాలకు తగ్గట్టు ఉల్లి సాగు ఇక్కడే జరుగాలి. ఎప్పుడూ కొరత లేకుండా వ్యూహం అవలంబించాలి.
చిక్కుడు, మునగలో పోషకాలు ఉన్నాయి. ఎక్కువగా తినేలా ప్రజలను చైతన్యపరచాలి. వాటి సాగు పెంచాలి.
ఆలుగడ్డలు, అల్లం, ఎల్లిపాయలను ప్రజలు ఎక్కువగా వాడుతారు. వీటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రంలోనే వాటిని పండించాలి. ఎక్కడ పండించాలి? మేలైన సాగు పద్ధతులేంటి? తదితర విషయాలపై రైతులకు మార్గదర్శనం చేయాలి.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews