తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం మండలిలో శాసనసభ్యులు జాఫ్రీ, టి. జీవన్‌రెడ్డి తదితరులు బిల్లుపై చర్చచేశారు.అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018లో కొత్త గ్రామాల ఏర్పాటు, గ్రామాల ప్రాంతాన్ని విస్తరించడం, తగ్గించడం, ఏదైనా గ్రామం పేరు లేదా హద్దుల మార్పు మొదలైన విషయాల్లో ముసాయిదా నోటిఫికేషన్ ను ఉభయసభల సమక్షంలో ఉంచాలి. వీటిని 30 రోజుల శాసనసభ పనిదినాల్లో కచ్చితంగా ఉండాలని పాత నిబంధన ఉంది.ఈ నిబంధనలతో గ్రామాల మార్పులు చేర్పులు సుదీర్ఘ సమయ పడుతోంది. ఈ నిబంధనపై తగిన విధంగా శాసనం చేయడం ద్వారా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 యొక్క 8వ షెడ్యూల్ సవరించాలని ప్రభుత్వం నిర్ణయించినదని మంత్రి వెల్లడించారు. ఈ బిల్లు ఉభయ సభల చర్చ ద్వారా వెంటనే ఆమోదం జరపడంతో నోటిఫికేషన్ విడుదల కు వీలవుతుందని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా పంచాయతీ రాజ్ చట్టము, 2018లో “ఎన్నికల ఖర్చు పద్దును దాఖలు చేయడంలో విఫలమయితే అర్హత కోల్పోయే” 23వ సెక్షన్ ను సవరించాలని ప్రతిపాదించారు.ఈ సెక్షన్ లో “వ్యక్తి” అనుపదం వార్డు సభ్యుడు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవికై పోటిచేయు అభ్యర్థులను సూచిస్తున్నది. ఈ సందిగ్దతను తొలగించడానికి, “వ్యక్తి” అను పదానికి బదులుగా “సర్పంచ్, ఎంపిటిసి,జెడ్‌పిటిసి పదవులకై పోటి చేయు అభ్యర్థి” అను పదాలను ఉంచాలని నిర్ణయించడమైనది. ఈ బిల్లు వల్ల ఎన్నికల ఖర్చు సమర్పించనందున వల్ల దాదాపు 32 వేల మంది వార్డు సభ్యులు అనర్హత పొందుతున్నారు. కావున ఈ చట్ట సవరణలను ఆమోదం తెలపాలని మంత్రి కోరగా.. సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించి బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు.