తగ్గేదేలే.. తాలిబాన్లకు ఆఫ్ఘన్ మహిళల హెచ్చరిక

ప్రస్తుతం అఫ్గన్‌ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది అఫ్గన్‌ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ‘మా హక్కులు మాకు ఇవాల్సిందే’ అంటూ నిరసన గళం వినిపిస్తున్నారు. అఫ్గన్‌ పశ్చిమ ప్రాంతంలోని చాలా ఊళ్లలో హక్కుల పరిరక్షణ కోసం మహిళలు ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మూడో అతిపెద్ద పట్టణం అయిన హెరాత్‌లో యాభై మంది మహిళలు మొదలుపెట్టిన నిరసన ప్రదర్శన.. మిగతా మహిళల్లో స్ఫూర్తి, ధైర్యాన్ని నింపింది. ఉద్యోగాల నుంచి తమను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వాళ్లు.విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనే డిమాండ్‌ మొదలైంది. ఇప్పటికే తాలిబన్ల సమావేశాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకపోగా.. క్యాబినెట్‌లోనూ మహిళలకు చోటు దక్కకపోవచ్చనే సంకేతాలిస్తుండడంపై అఫ్గన్‌ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హక్కుల్ని రక్షించుకోవడం కోసం చావడానికైనా సిద్ధం అని ప్రకటించుకుంటున్నారు వాళ్లు. మరోవైపు కుటుంబాలతో సహా ఆడవాళ్లు నిరసనల్లో పాల్గొంటున్నారు. ‘‘బుర్ఖాలకు మేం సిద్ధం. ప్రతిగా తమ ఆడబిడ్డలను చదువు, ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించాలని కొందరు తల్లులు, తాలిబన్లను డిమాండ్‌ చేస్తున్నారు. కాబూల్‌లో కిందటి నెలలో ఇలాంటి ర్యాలీ ఒకటి జరిగింది. అయితే తాలిబన్లు సమర్థవంతంగా ఆ ఉద్యమాన్ని అణచివేశారు. కానీ, ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో తలమునకలైన క్రమంలో ఊహించని పరిణామాలు ఎదురుకావడం తాలిబన్లకు మింగుడు పడడం లేదు.
మరోపక్క ఆడవాళ్లు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి తమ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాబోవని, వాళ్లకు ఆ స్వేచ్ఛ ఉందని తాలిబన్లు ప్రకటనలు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు మహిళా నిరసనకారులు. ‘‘తాలిబన్లవి అబద్దపు ప్రచారాలు. ఆడవాళ్లను అసలు ఆఫీసుల్లోకి అనుమతించడం లేదు. కాదని వెళ్లే ప్రయత్నాలు చేస్తే అరెస్ట్‌ చేస్తున్నారు. ఆడ పిల్లలను స్కూల్స్‌, కాలేజీల్లోకి అనుమతించలేదు. ఇదేనా వాళ్లిచ్చే స్వేచ్ఛ’’ అంటూ తాలిబన్లపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews