మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’- కేటీఆర్

దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రేటర్‌ నగరం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ప్రజలు నగరం నలుమూలలకు తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారని చెప్పారు. ఒకప్పుడు ఎంసీహెచ్‌ 150 నుంచి 160 చదరపు కిలోమీటర్ల మేరకు ఉండేదని, జీహెచ్‌ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత నగరం 625 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 1950 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఉత్పన్నమవుతోందని, దీనిలో 94 శాతం మురుగు నీరు గ్రావిటి ద్వారా మూసీనదిలోకి వెళుతుందని పేర్కొన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భోలక్‌పూర్‌లో మంచినీరు కలుషతిమై 9 మంది చనిపోయారని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని అన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews