నా కెప్టెన్సీ పోవటానికి చాపెల్ ఒక్కరే కారణం కాదు, నేను నమ్మిన వారే నన్ను మోసం చేసారు -గంగూలీ

భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం. అయితే 2005లో గంగూలీ అనూహ్యంగా తన కెప్టెన్సీని కోల్పోయారు. దీనికి అనేక కారణాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అప్పటి జట్టు కోచ్ గ్రెగ్ చాపెల్ పాత్ర అత్యధికంగా ఉన్నట్లు విమర్శలొచ్చాయి. దీనిపై గంగూలీ ఎట్టకేలకు సమాధానమిచ్చారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెప్టెన్సీ పోవడానికి గ్రెగ్ చాపెల్ మాత్రమే కారణం కాదని, తన చుట్టూ ఉన్న అనేకమంది కారణమని గంగూలీ చెప్పారు. ‘2003లో ఫైనల్ వరకూ వెళ్లి ఓటమి పాలవ్వడం నాకు చాల బాధ కలిగించింది. దాంతో 2007లో ఎలాగైనా ప్రపంచకప్ గెలవాలని కలలుకన్నాను. కానీ 2005లో నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించడంతో తీవ్ర దిగ్బాంతికి గురయ్యాను. అంతేకాకుండా మొదట వన్‌డే జట్టు నుంచి తొలగించారు.ఆ తరువాత టెస్ట్ జట్టులో కూడా పేరు లేకుండా చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామాలు నాపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని ఇప్పటికీ అంగీకరించను. కచ్చితంగా అది నాకు జరిగిన అతిపెద్ద అన్యాయమే. అయితే అందుకు గ్రెగ్ చాపెల్ మాత్రమే కారణమని చెప్పను. ఒక విదేశీ కోచ్ కారణంగా భారత క్రికెట్ జట్టు కెప్టెన్ తన స్థానాన్ని కోల్పోవడం ఎట్టిపరిస్థితుల్లో జరగదు.
నాతోనే ఉన్న వాళ్లే నా కెప్టెన్సీ పోవడానికి కారణమయ్యారు. కానీ నన్ను కెప్టెన్సీ నుంచి తొలగించాలనే ఆలోచన మాత్రం తొలుత చాపెల్ బుర్రలోనే పుట్టిందని మాత్రం చెప్పగలను’ అంటూ గంగూలీ తెలిపారు. ఇదిలా ఉంటే అప్పటి కోచ్ గ్రెగ్ చాపెల్ గంగూలీకి వ్యతిరేకంగా బీసీసీఐకి ఓ మెయిల్ పంపాడు. ఈ మెయిల్ లీక్ అవడంతో చాపెల్ వల్లే గంగూలీ కెప్టెన్సీ కోల్పోయాడంటూ అప్పట్లో పెద్ద దుమారమే రేగింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews